డెడ్‌లైన్‌ మార్చి 31

కంది : కొత్తగా బీఎస్‌-4 వాహనం కొని ఉండి ఇంకా రిజిస్ట్రేషన్‌ చేయించుకోలేదా.. మీరు బీఎస్‌-3, బీఎస్‌-4 ద్విచక్ర, త్రిచక్ర, ఫోర్‌ వీలర్‌ వాహనాలను కొని రిజిస్ట్రేషన్‌ చేయించుకోలేదా..అయితే మీరు వెంటనే ఆ పని చేయకపోతే మీ వాహనం స్క్రాప్‌ కిందకే పరిమితమవుతుంది. సుప్రీం కోర్టు తాజాగా ఇచ్చిన సూచనల ప్రకారం ప్రస్తుతం మార్చి 31 నాటికి అన్ని బీఎస్‌-3, బీఎస్‌-4 రకాల వాహనాలు రిజిస్ట్రేషన్లు పూర్తి చేయించుకోవాలి. లేకపోతే ఆ వాహనాలను నడిపేందుకు అనుమతులు ఇకపై ఇవ్వరు. ఒకవేళ మీరు వాహనాలు రోడ్డుపై నెంబర్‌ లేకుండానే నడుపాలని చూసినా ఆ వాహనాలను ఆర్టీఏ అధికారులు సీజ్‌ చేయనున్నారు. ఇప్పటికే ఉమ్మడి మెదక్‌ జిల్లాలోని సంగారెడ్డి, సిద్దిపేట, మెదక్‌ ప్రాంతాల్లో మొత్తం 23,504 వాహనాలు కొత్తగా కొని ఇంకా రిజిస్ట్రేషన్‌ ప్రక్రియ పూర్తి చేసుకోలేనట్లు ఆర్టీఏ అధికారులు గుర్తించారు. వెంటనే ఆ వాహనాలను రిజిస్ట్రేషన్‌ చేయించుకునేలా మార్చి 31 డెడ్‌లైన్‌ తేదీ నాటికి పూర్తి చేసుకోవాలని అన్ని వాహనదారులకు నేరుగా ఫోన్‌కు మెసేజ్‌ ద్వారా సమాచారాన్ని అందిస్తున్నారు. సమాచారం అందని వారిని గుర్తించి వారికి సంబంధిత డీలర్ల ద్వారా ఈ సమాచారాన్ని చేరవేసేలా అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. అయితే ఏప్రిల్‌ 1వ తేదీ నుంచి ఎలాంటి బీఎస్‌-4 వాహనాలకు రిజిస్ట్రేషన్లు చేయబోమని ఆర్టీఏ ఉమ్మడి మెదక్‌ జిల్లా ఉప రవాణాశాఖ కమిషనర్‌ శివలింగయ్య స్పష్టం చేశారు. ఈ మేరకు మంగళవారం ఆయన విలేకరుల సమావేశాన్ని ఏర్పాటు చేసి ఇందుకు సంబంధించిన వివరాలను వెల్లడించారు.