నా ఫేవరెట్‌ బ్యాట్స్‌మెన్‌ అతడే: బ్రియాన్‌ లారా

వెస్టిండీస్‌ జట్టు మాజీ కెప్టెన్‌, టెస్టుల్లో అత్యధిక వ్యక్తిగత పరుగులు(400 నాటౌట్‌) సాధించిన బ్యాట్స్‌మెన్‌ బ్రియాన్‌లారా.. తనకు ఇష్టమైన బ్యాట్స్‌మెన్‌ ఎవరో చెప్పాడు. ముంబయిలో జరుగుతున్న రోడ్‌ సేఫ్టీ వరల్డ్‌-2020 సిరీస్‌లో వెస్టిండీస్‌ లెజెండ్స్‌ జట్టుకు సారథ్యం వహిస్తున్న లారాను మీడియా పలకరిచింది. ఈ సందర్భంగా మీకు ఇష్టమైన బ్యాట్స్‌మెన్‌ ఎవరని అడగగా.. లారా సమాధానమిచ్చారు. కాగా, తనకిష్టమైన బ్యాట్స్‌మెన్‌లో భారత ఆటగాడున్నాడని సస్సెన్స్‌ ఇచ్చాడు. మీడియా వారు విరాట్‌ కోహ్లి లేదా రోహిత్‌ శర్మ పేరు చెబుతాడనుకున్నారు. కానీ, లారా మాత్రం వారు కాదన్నాడు.


ఎవరా బ్యాట్స్‌మెన్‌ అని లారాను ఆరా తీయగా.. యువ ఆటగాడు, ‘భారత మిస్టర్‌ 360’ కే.ఎల్‌.రాహుల్‌ అని తెలిపాడు. రాహుల్‌ చాలా తెలివైన ఆటగాడని ఆయన ప్రశంసించారు. మైదానం నలువైపులా షాట్లు ఆడగల నేర్పరి రాహుల్‌ అని లారా అన్నారు. ప్రస్తుతమున్న బ్యాట్స్‌మెన్స్‌లో లోకేష్‌ రాహుల్‌ అద్భుతమైన ఆటగాడనీ.. బ్యాటింగ్‌తో పాటు వికెట్‌ కీపింగ్‌ చేయగల నేర్పు రాహుల్‌ అదనపు బలమని ఆయన అన్నారు.